

విశ్వావసు నామ సంవత్సరంలో కలిగే మార్పులు ఏంటి?
భగవంతుడి మీద విశ్వాసం కలిగి పయనిస్తే శ్రీవిశ్వావసు మనకు సత్పలితాలను ఇస్తుంది. అడపాదడపా కొంత ప్రకృతి ప్రకోపించే అవకాశాలున్నా, మొత్తం మీద వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మేలు కలిగే సూచనలున్నాయి.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అవసరం. శాంతిభద్రతల విషయంలో సునిశిత నిఘా, అప్రమత్తత అవశ్యం. ఇది స్థూలంగా దైవజ్ఞులు శ్రీవిశ్వావసు నామ సంవత్సర పంచాంగంలో వెల్లడించిన ఫలితాంశాలు. అందరికీ మేలు జరగాలని, దేశం సుభిక్షంగా, పాలన సుస్థిరంగా ఉండాలని ఆశిద్దాం.
ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు రానున్నాయి?
ఈ సంవత్సరము రోగములు ప్రబలును, సాధారణమైన వర్షాలతో పంటలు తక్కువగా పండడం వలన ధరలు పెరగడం, రోగాలు, రాజకీయ ఇబ్బందులు, విరోధములు పెరుగుతాయి. దూది, నూలు, పత్తి వస్త్రముల ధరలు పెరుగుతాయి. రాజులు ప్రజల విశ్వాసాన్ని పొందడం కష్టమవుతుంది.
చైత్రంలో రాజకీయ కల్లోలములు, ధాన్యముల ధరలు పెరుగుట, వైశాఖంలో కలహాలు, ప్రజాక్షోభము, దేశంలో దుర్భిక్షము, పశ్చిమాన ఆహారపదార్థాల కొరత, జ్యేష్ఠ మాసంలో రోగ, అగ్ని భయాలు, పొట్లాటలు, ఆషాఢంలో అల్పవృష్టి, శ్రావణ, భాద్రపద మాసాలలో కొన్ని ప్రాంతాలలో సువృష్టి, సుభిక్షము, ఆశ్వయుజంలో రోగబాధలు, పశువుల ధరలు పెరుగుట, వెండి, బంగారు ధరలు నిలకడ, కార్తిక, మార్గశిర, పుష్య మాసాలలో అన్నివస్తువుల ధరలు నిలకడగా ఉంటాయని.. మాఘ, ఫాల్గుణాలలో ధరలు పెరిగే అవకాశం వుంది
రాజాది నవ నాయక నిర్ణయ ఫలము
1. రాజు – రవి, 2. మంత్రి చంద్రుడు, 3. సేనాధిపతి – రవి, 4. సస్యాధిపతి- గురుడు, 5. ధాన్యాధిపతి కుజుడు, 6. అర్ఘాధిపతి – రవి, 7. మేఘాదిపతి రవి, 8. రసాధిపతి – శని, 9. నీరసాధిపతి – కుజుడు
1. రాజు – రవి :
సూర్యుడు రాజైనందున మంత్రులకు పరస్పర విరోధము ఎక్కువగును. మేఘములు చక్కగా వర్షించును. నాయకులకు, ప్రజలకు మధ్య పోట్లాటలు, పాలకులకు ఆయుధముల వల్ల భయం, ప్రజలకు చోర, అగ్ని వలన బాధలు అధికం.
2. మంత్రి – చంద్రుడు
చంద్రుడు మంత్రి అగుట వలన సువృష్టి, అన్ని రకాల పంటలు బాగా పండును. ధాన్యం, వ్యాపారముల వలన లాభం, ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా వుంటారు, పాలకులు అనేక రాయితీలు ప్రకటిస్తారు.
3. సేనాధిపతి రవి :
రవి సేనాధిపతి అగుట వలన ఇరుగుపొరుగు వారితో ప్రజలలో ఇబ్బందులు, అధికారులు, పాలకులకు మధ్య అభిప్రాయ భేదములు, స్వల్పవర్షాలు, ఎరుపు రంగు ధాన్యాల పంటలు బాగా పండును.
4. సస్యాధిపతి – గురుడు :
సస్యాధిపతి గురుడు అవ్వడం వలన ఉలువలు, గోధుమలు, శనగల పంటలు అధికం, బంగారం ధర పెరుగును. పసుపు రంగు నేలలలో సస్యవృద్ధి. వర్షపాతం అధికం, గోదావరి తదితర నదులు బాగా ప్రవహిస్తాయి.
5. ధాన్యాధిపతి కుజుడు :
ధాన్యాధిపతి కుజుడు అయినందున రైతుల మధ్య పరస్పరం వైరభావం ఏర్పడుతుంది. పంటలు కొన్ని రకాల కీటకాదుల వలన నశించును.
6. అర్ధాధిపతి – రవి :
అర్ఘాధిపతి రవి అవ్వడం వలన ధరలు తగ్గును. అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధలు, మంత్రుల మధ్య కలహాలు, లోహాల ధరలు పెరుగును. కొన్నిచోట్ల పిడుగులు, వడగండ్ల వానలు కురియును.
7. మేఘాధిపతి రవి :
మేఘాధిపతి రవి అయినందున ప్రజలలో భయాందోళనను కలిగించే సంఘటనలు జరుగును. ఖండఖండాలుగా వర్తించును. పంటలు బాగా పండిననూ, క్రిమికీటకాదుల వల్ల నష్టం, ఎరుపు రంగు భూములు, ఎర్రని ధాన్యాలు బాగా పండును.
8. రసాధిపతి – శని :
రసాధిపతి శని అవ్వడం వలన నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు రసజాతులకు ధరలు తగ్గును. చెఱుకు పంట దిగుబడి తగ్గును. అకాల వర్షాలుంటాయి.
9. నీరసాధిపతి బుధుడు :
నీరసాధిపతి బుధుడు అయినందున మణి, మరకతములకు వివిధ ధాన్యాల ధరలు పెరుగును. గాలులతో కూడిన వర్షాలుండును. తుఫానులు, ఉప్పెనలు వచ్చే అవకాశాలున్నాయి.