
Mesha Rasi Ugadi Panchangam: మేష రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి? మేష రాశి వారు ఈ కొత్త తెలుగు సంవత్సరంలో కొన్ని లాభాలు, కొన్నిసమస్యలు ఎదుర్కోబోతున్నారు.
విశ్వావసు నామ సంవత్సరం మేష రాశి ఫలితములు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) రాశి ఫలితములు
విశ్వావసు నామ సంవత్సరం మేష రాశి ఫలితములు..
గురు వృషభ రాశి సంచారంతో ఆకస్మిక ధన లాభం
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. ధర్మకార్యాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేస్తారు.
15.5.25 నుంచి 19.10.25 వరకు, తిరిగి 6.12.25 నుండి సంవత్సరాంతం వరకు మిథునంలో ఉంటాడు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఋణ ప్రయత్నాలు చేస్తారు.
శని మీన రాశి సంచారంతో అనారోగ్య బాధలు
శని ఈ సంవత్సరం ఉగాది నుండి ఏడాది చివరి వరకు మీనంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
రాహువు మీన రాశి సంచారంతో ధన నష్టం
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగుట మంచిది.
19.5.25 నుండి ఏడాది చివరి వరకు కుంభంలో ఉంటాడు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభ యోగము ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కేతువు కన్యా రాశి సంచారంతో విదేశయాన ప్రయత్నాలు
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగము ఉంటుంది. అన్నివిషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
19.5.25 నుండి వత్సరాంతం వరకు సింహంలో ఉంటాడు. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ నెల:
మేష రాశి వారికి ఈ మాసము అంత అనుకూలంగా లేదు. పెద్దవారి సలహాలు పాటించుట మంచిది. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. రాబడిపై దృష్టిపెడతారు.
మే నెల:
మేష రాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి.
జూలై నెల:
మేష రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలన మార్పులుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మాట పట్టింపులుంటాయి. జాయింట్ వ్యాపారం అనుకూలించును. అనారోగ్య సూచనలుంటాయి.
ఆగస్టు నెల
ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. అప్పులు తీర్చుతారు. మీరు చేసే ప్రతి పనిలో చికాకులు ఎదురై చివరకు పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం. ధనవ్యయము ఉంటుంది. అనవసరపు ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా జీవిస్తారు.
సెప్టెంబర్ నెల
మేష రాశి వారికి ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలుంటాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన యోగం. మనస్సులో భయాందోళనలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారము ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరాశ ఉండొచ్చు.
అక్టోబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. సినీ పరిశ్రమల వారికి అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ బోనస్లు. మీరు చేసే పనులులో విజయం సాధిస్తారు. మానసిక ఆనందము ఉంటుంది.
నవంబర్ నెల
మేష రాశి వారు ఈ మాసం అనుకూలంగా లేదు. వృధాఖర్చులు అధికమవుతాయి. శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మనస్సురందు భయమేర్పడును. జాయింట్ వ్యాపారములలో మోసపోవచ్చు.
డిసెంబర్ నెల
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. స్త్రీ వలన ధనవ్యయముండును. వ్యాపారమూలకంగా ధన నష్టములు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. శత్రువుల వలన భయము. అధికారం వలన లాభములు. అధిక ప్రయాణములుంటాయి.
జనవరి నెల
మేష రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. కుటుంబములో ఆనందము ఉండదు. సంతానం గూర్చి ఆలోచనలుంటాయి. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులుంటాయి. ధన లాభం ఉంటుంది. మీ సలహాను ఇతరులు పాటిస్తారు. భార్యకు అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువుల వలన భయము ఉంటుంది.
ఫిబ్రవరి నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అనారోగ్య సూచనలున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోను ఆటంకము ఏర్పడును. స్త్రీ పరిచయం అవుతుంది. దేవాలయ దర్శానికి వెళ్తారు. వ్యాపారములో లాభములు వచ్చినప్పటికి ఆటంకములు ఉంటాయి.
మార్చి నెల
మేష రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. డబ్బు అధికముగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు అంతగా రాణించవు. శుభములకు ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.